న్యూఢిల్లీ, మే 22: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అన్ని హద్దులను దాటుతున్నదని, రాజ్యాంగంలోని సమాఖ్య పాలన భావనను అతిక్రమిస్తున్నదని సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్ర మద్యం లైసెన్సుల నిర్వహణ సంస్థ తస్మాక్{తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్)పై ఈడీ దాడులు, దర్యాప్తును సుప్రీంకోర్టు నిలిపివేసింది.
తస్మాక్పై ఈడీ దర్యాప్తునకు అనుమతినిస్తూ ఏప్రిల్ 23న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును మద్రాసు హైకోర్టు మంగళవారం కొట్టివేసిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం ఈడీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.