న్యూఢిల్లీ, జనవరి 2: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వచ్చిన ఫలితం ఆధారంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టలేమని తెలిపింది. రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆరు నెలలపాటు సంప్రదింపులు జరిగిన తరువాతనే నోట్ల రద్దు నిర్ణయం వెలువడిందని తెలిపింది. ఇందులో చట్టపరమైన లేదా రాజ్యాంగపరమైన తప్పిదాలు ఏమీ దొర్ల లేదని పేర్కొంది. జస్టిస్ ఎన్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ధర్మాసనంలోని సభ్యురాలు జస్టిస్ బీవీ నాగరత్న విభేదించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక విధానంలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చలేము అని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ఆర్థిక విధానానికి సంబంధించిన విషయాలలో ఎంతో సంయమనం పాటించాలని సూచించింది. నోట్ల రద్దు నిర్ణయం వెనుక కార్యనిర్వాహక వర్గం విచక్షణను న్యాయ సమీక్ష ద్వారా తిరగదోడలేమని స్పష్టంచేసింది. నోట్ల రద్దు నిర్ణయం అసమంజసమని చెప్పలేమని, కేవలం ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక జరిగిన ప్రక్రియను బట్టి దానిని కొట్టివేయలేమని తెలిపింది.
ఆ గడువు సమంజసమే..
నల్లధనం నిర్మూలన, ఉగ్రవాదులకు నిధులు రాకుండా అడ్డుకోవడం వంటి కొన్ని లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నదని.. అయితే ఆ లక్ష్యాలు సాధించారా లేదా అన్నది అసంబద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. రద్దు చేసిన నోట్లను మార్చుకొనేందుకు ప్రభుత్వం ఇచ్చిన 52 రోజుల గడువు సమంజసమేనని, ఇప్పుడు ఆ గడువును పొడిగించలేమని తెలిపింది. నిర్దిష్ట గడువు ముగిసిన తరువాత రద్దయిన నోట్లను స్వీకరించే అధికారం రిజర్వు బ్యాంక్‌కు లేదని స్పష్టంచేసింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకొనేందుకు ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది.
పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్రం 2016, నవంబర్ 8న తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో విచారణ సందర్భంగా.. నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బీఐని గత నెల 7న ఆదేశించింది. అనంతరం ఈ కేసుపై విచారణ ముగించిన న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. సోమవారం రెండు వేర్వేరు తీర్పులు వెలువడ్డాయి. జస్టిస్ బీఆర్ గవాయ్ మెజారిటీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును, జస్టిస్ బీవీ నాగరత్న రెండో తీర్పును వెలువరించారు.
నిర్ణయం చట్ట విరుద్ధం: జస్టిస్ నాగరత్న
ధర్మాసనంలోని సభ్యులలో అందరికన్నా పిన్న వయస్కురాలైన జస్టిస్ బీవీ నాగరత్న ఈ తీర్పుతో విభేదించారు. నోట్ల రద్దు విషయంలో కేంద్రం వైఖరిని ఆమె తప్పు పట్టారు. ఒకేసారి అన్ని సిరీస్‌ల నోట్లను రద్దు చేయడం ఎంతో తీవ్రమైన అంశమని, ఇది దేశ ఆర్థిక పరిస్థితిపై దేశ పౌరులపై తీవ్రమైన ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంలో ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించలేదని అన్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో మొత్తం ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారాలు ఎంతో విస్తృతమైనవైనందున తన నిర్ణయాన్ని కేవలం ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో వెలువరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులున్న పార్లమెంట్లో దీనిపై చర్చించి, ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. నోట్ల రద్దు చట్ట విరుద్ధమేనని తేల్చి చెప్పారు. ‘2016లో వెలువడిన నోటిఫికేషన్ ఇది. దీనిపై ఇప్పుడు ఎటువంటి స్టే ఇవ్వడం కుదరదు. పిటిషనర్లకు ఎటువంటి ఉపశమనం ఇవ్వలేం’ అని పేర్కొన్నారు.