న్యూఢిల్లీ, జనవరి 20: కులం ఆధారంగా వ్యక్తిని అవమానించే ఉద్దేశం స్పష్టంగా ఉంటే తప్ప ఎస్సీ లేదా ఎస్టీకి చెందిన వ్యక్తిని దుర్భాషలాడినంత మాత్రాన స్వయంచాలకంగా(ఆటోమేటిక్‌గా) ఎస్సీ/ఎస్టీ చట్టం కింద నేరంగా పరిగణించబడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బీహార్‌లోని అంగన్వాడీ కేంద్రం వద్ద షెడ్యూల్డు కులానికి చెందిన ఓ వ్యక్తిని దుర్భాషలాడారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న కేశవ్ మహతో అనే వ్యక్తిపై నమోదుచేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. కులం ఆధారంగా ఫిర్యాదుదారుడిని మహతో దూషించినట్లు ఎఫ్ఐఆర్లో కాని చార్జిషీట్లో కాని పేర్కొనలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఎస్సీ/ఎస్టీ చట్టానికి చెందిన సెక్షన్ 3(1)(ఆర్)ని సుప్రీంకోర్టు ఉటంకిస్తూ ఈ నిబంధన కింద ఓ వ్యక్తిని శిక్షించడానికి నిర్దిష్టమైన షరతులు రెండు ముఖ్యమని కోర్టు పేర్కొంది. మొదటగా ఫిర్యాదుదారుడు ఎస్సీ లేదా ఎస్టీ అయి ఉండాలని, రెండవది ఫిర్యాదుదారుడి కులం ఆధారంగా దూషించినట్లు లేదా అవమానించినట్లు నిర్దిష్టంగా ఉండాలని కోర్టు వివరించింది. ఒక నేరం నిరూపితం కావాలంటే బాధితుడు ఎస్సీ లేదా ఎస్టీకి చెందినవాడు అనే కారణంతో నిందితుడు బాధితుడిని ఉద్దేశపూర్వకంగా అవమానించాడని లేదా బెదిరించాడని చూపించాల్సి ఉంటుందని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.