Supreme Court | న్యూఢిల్లీ, మార్చి 28/(స్పెషల్ టాస్క్ బ్యూరో): వ్యక్తులు వ్యక్తపరిచే భిన్నమైన అభిప్రాయాలను ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తుల భావ ప్రకటన ప్రజాస్వామిక హక్కు అన్న అత్యున్నత న్యాయస్థానం.. ఆ హక్కును అందరూ తప్పకుండా గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పింది. అలాగే ప్రాథమిక హక్కుల్లో భాగమైన వ్యక్తుల భావ ప్రకటనను పరిరక్షించడం న్యాయస్థానాలతో పాటు పోలీసుల విధి అని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం భావ ప్రకటన స్వేచ్ఛపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ ఓ పెండ్లి వేడుక మధ్యలో నడిచి వస్తుండగా ఆయనపై పూలవర్షం కురిసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పద్యం వినిపించింది. ఈ వీడియోను ఆయన గత డిసెంబర్లో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన పద్యంలోని కొన్ని పదాలు రెచ్చగొట్టేలా.. మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను విచ్ఛిన్నం చేసేలా, సమాజంలో ఘర్షణలు, అశాంతి రేకెత్తించేలా ఉన్నాయంటూ ఆయనపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దీనిపై విచారించిన ధర్మాసనం భావ ప్రకటన స్వేచ్ఛపై పలు కీలక వ్యాఖ్యలు చేస్తూనే.. గుజరాత్ పోలీసుల అత్యుత్సాహంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీపై నమోదు చేసిన కేసును కొట్టెయ్యాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.