న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులోని ఓ ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరో ధర్మాసనం కొట్టివేసే ధోరణి పెరిగిపోతుండటాన్ని జస్టిస్‌లు దీపాంకర్ దత్తా, అగస్టీన్ జార్జి మసీహ్ ధర్మాసనం ఖండించింది. మొదటి ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌ను రద్దు చేయించుకోవడం కోసం కక్షిదారులు వేరొక ధర్మాసనాన్ని ఆశ్రయిస్తున్నారని తెలిపింది. రెండో ధర్మాసనం చేత ఆ కేసు విచారణను తిరిగి ప్రారంభింపజేస్తుండటం పెరుగుతున్నదని వ్యాఖ్యానించింది.
ఇటువంటి ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో రాజ్యాంగంలోని అధికరణ 141 ప్రకారం అంతిమ తీర్పు భావనకు విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. తీర్పు వెలువడిన కేసులను, మరీ ముఖ్యంగా, పూర్వం తీర్పులు వెలువడిన దృష్టాంతాలు లేని వివాదానికి సంబంధించిన కేసులు అయినపుడు, వాటిని తిరిగి తెరవడం వల్ల న్యాయపరమైన, చట్టపరమైన వివరణలో పొంతన లేకపోవడం జరుగుతుందని తెలిపారు.