Dowry | న్యూఢిల్లీ : వరకట్న వేధింపుల నిషేధ చట్టంగా పేరొందిన ఐపీసీ సెక్షన్ 498ఏకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ కింద నేరం రుజువు చేసేందుకు భర్త వరకట్నం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. వివాహిత పట్ల ఏ రకంగా క్రూరత్వం చూపినా ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నది. వరకట్నం కోసం డిమాండ్ చేయలేదనే కారణంతో ఓ వ్యక్తిపై నమోదైన 498ఏ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వివాహిత దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
‘ఏ రకమైన క్రూరత్వం చూపించినా లేదా వరకట్నం డిమాండ్ చేసినా ఐపీసీ సెక్షన్ 498ఏ వర్తిస్తుంది. శిక్షార్హమైన నేరం అవుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘మానసికంగా లేదా శారీరకంగా హాని తలపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించినా(క్లాజ్ ఏ) లేదా మహిళ, ఆమె కుటుంబాన్ని చట్టవిరుద్ధమైన డిమాండ్‌ను నెరవేర్చమని వేధించినా(క్లాజ్ బీ) సెక్షన్ 498ఏ వర్తిస్తుంది’ అని పేర్కొన్నది. ‘వరకట్న వేధింపుల వల్ల మరణాలతో పాటు వివాహిత మహిళపై అత్తింటివారి వేధింపుల కేసులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ చట్టం వచ్చింది’ అని పార్లమెంటును ఉటంకిస్తూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.