న్యూఢిల్లీ: కేరళలో సీపీఎం పార్టీ అభ్యర్థి ఏ రాజా.. ఎమ్మెల్యేగా ఎన్నికైన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు జరిగాయి. దేవకులం నియోజకవర్గం నుంచి 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ స్థానం కావడం వల్ల .. రాజా ఎన్నికను ప్రశ్నిస్తూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కేసు దాఖలు చేశారు.
గతంలో కేరళ హైకోర్టు తీర్పునిస్తూ ఎమ్మెల్యే రాజా ఎన్నికను రద్దు చేసింది. అయితే ఇవాళ ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అసనుద్దిన్ అమానుల్లా, ఆగస్టిన్ జార్జ్ మాషిలతో కూడిన సుప్రీం ధర్మాసం ఈ కేసులో తీర్పును ఇచ్చింది.
ఎమ్మెల్యే రాజా క్రిస్టియన్ అని, ఆయన ఎలా ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కేరళ హైకోర్టు లో కేసు దాఖలైంది. ఈ కేసులో కేరళ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. శాసనసభ పోస్టుకు పిటీషనర్ అర్హుడని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది.