న్యూఢిల్లీ: దేవాలయాల్లో సంపన్నుల కోసం ప్రత్యేక పూజలకు అనుమతించడం వల్ల భగవంతుని విశ్రాంతికి అంతరాయం కలుగుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. బృందావనంలోని బంకీ బీహారీ జీ దేవాలయంలో (Banki Bihari Ji Temple) దర్శన సమయాలను, ఆచార, సంప్రదాయాలను మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్నది. సుప్రీంకోర్టు నియమించిన హై-పవర్డ్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీకి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, దేవాలయం పని వేళలను మార్చడం వల్ల దేవాలయంలోని ప్రధాన దైవం ఉదయం మేలుకునే, రాత్రి పవళించే సమయాల్లో కూడా మార్పులు జరుగుతున్నాయని తెలిపారు.
దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, దేవాలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసేసిన తర్వాత, ప్రధాన దైవానికి కనీసం ఒక సెకండ్ సమయమైనా విశ్రాంతి ఇవ్వడం లేదన్నారు. ప్రధాన దైవాన్ని దోచుకుంటున్నారన్నారు. భారీగా సొమ్ము చెల్లించగలిగే సంపన్నుల కోసం ప్రత్యేక పూజలు చేయడానికి అవకాశం ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గైడ్‌లైన్స్ ఎక్స్‌ప్రెస్‌వేలు, నేషనల్ హైవేలపైన రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పాన్-ఇండియా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించింది. రాజస్థాన్‌లోని ఫలోడీలో 15 మందిని బలిగొన్న తాజా రోడ్డు ప్రమాద ఘటనను సుప్రీంకోర్టు సోమవారం ప్రస్తావించింది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపైన అక్రమంగా నిర్మించిన ధాబాలపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రహదారులపై రెండు వైపులా వెలసిన అక్రమ ధాబాల కారణంగానే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.