న్యూఢిల్లీ: పురుషులతో సమానంగా మహిళల కనీస పెళ్లి వయసును 21కి పెంచాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థనను సోమవారం తిరస్కరించింది. కొన్ని అంశాలు పార్లమెంటుకు చెందుతాయని స్పష్టం చేసింది. కోర్టులు చట్టాన్ని రూపొందించలేవని పేర్కొంది. దేశంలో పురుషులు వివాహం చేసుకునేందుకు కనీస వయసు 21 కాగా, మహిళల వివాహానికి కనీస వయసు 18. ఈ నేపథ్యంలో స్త్రీ, పురుషులకు వివాహ వయస్సులో చట్టబద్ధమైన సమానత్వాన్ని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్త్రీ, పురుషుల పెళ్లి వయస్సులో వ్యత్యాసం వల్ల లింగ సమానత్వం, న్యాయపరంగా, మహిళల గౌరవానికి సంబంధించిన అంశాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కాగా, దేశంలో స్త్రీ, పురుషుల వివాహానికి కనీస వయో పరిమితి విధించడం మహిళ పట్ల వివక్షను కొనసాగించడమేనని పిటిషనర్ ఆరోపించారు. పితృస్వామ్య మూస పద్ధతుల ఆధారంగా పురుషులకు కనీస పెళ్లి వయసు 21గా, స్త్రీలకు 18గా నిర్ణయించారని విమర్శించారు. ఎలాంటి శాస్త్రీయత లేని ఈ నిర్ణయం, న్యాయపరంగా, వాస్తవాలకు విరుద్ధంగా, ప్రపంచ వ్యాప్త పరిస్థితులకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ వ్యత్యాసం వల్ల వివాహిత మహిళ భర్తకు అణిగిమణిగి ఉండాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు వయసులో భార్య చిన్నది కావడంతో పెద్ద వయసున్న భర్తను గౌరవించాలని, సేవ చేయాలన్నది సామాజిక వాస్తవికతగా మారిందని పిటిషనర్ తెలిపారు. అంతేగాక ఈ వ్యత్యాసం వైవాహిక సంబంధాలను ప్రభావితం చేస్తున్నదని, దంపతుల మధ్య ఘర్షణలను తీవ్రం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పురుషులతో సమానంగా స్త్రీల కనీస వివాహ వయస్సును 21కి పెంచాలని కోరారు. దీని కోసం సంబంధిత చట్టాన్ని సవరించాలని కోర్టును అభ్యర్థించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ పిటిషన్ కోసం పార్లమెంట్‌కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు కొట్టివేయడం వల్ల మహిళల వివాహానికి కనీస వయస్సు ఉండకుండా పోతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంది.