న్యూఢిల్లీ : చెట్లను నరకబోమన్న హామీకి కట్టుబడి ఉండాలని ముంబై మెట్రోల్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉల్లంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 30న విచారణ జరుపనున్నట్లు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ సుధాన్షు ధూలియా ధర్మాసనం పేర్కొంది. అంతకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది పత్రాల సేకరణ కోసం సమయం కోవాలని కోరారు.
ఇప్పటికే ఎంఎంఆర్‌సీఎల్ డైరెక్టర్ అఫిడవిట్‌ను రికార్డ్ చేశారని, ఎంఎంఆర్‌సీఎల్ దానికి కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అనితా షెనాయ్ వాదనలు వినిపిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ చెట్లను నరికి, భూమి చదును చేసే పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అక్టోబర్ 2019 తర్వాత ముంబైలోని ఆరే కాలనీలో చెట్లను నరకలేదని ఎంఎంఆర్‌సీఎల్ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది.