న్యూఢిల్లీ, నవంబర్ 17: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌ను న్యాయవాది మాథ్యూస్ జే నెదుంపారా దాఖలు చేశారు. ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ సరిగా లేదని, అర్హులైన వారిని న్యాయమూర్తులుగా సిఫారసు చేయడం లేదని పిటిషన్‌దారు ఆరోపించారు.
న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాలంటే తొలుత ఓ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. తర్వాత అర్హతలను బట్టి న్యాయమూర్తులుగా ఎంపిక చేయాలని కోరారు. కానీ ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ వల్ల పారదర్శకత దెబ్బతింటున్నట్టు తాను భావిస్తున్నానని, అందుకే దీనిపై విచారణ జరుపాలని కోరారు. నియామకాల కోసం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.