న్యూఢిల్లీ: రాజకీయ విశ్లేషకుడు, సీఎస్డీఎస్ మాజీ డైరెక్టర్ సంజయ్ కుమార్(Sanjay Kumar)పై నమోదు అయిన వివిధ ఎఫ్ఐఆర్లపై దర్యాప్తును నిలిపివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు స్టే జారీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని కొన్ని నియోజకవర్గాలు ఓటింగ్‌లో అవకతవకలు జరిగినట్లు ఆయన కొన్ని రోజుల క్రితం వివాదాస్పద పోస్టు పెట్టారు. ఆగస్టు 17వ తేదీన పెట్టిన ఆ పోస్టుపై పలు పోలీసు స్టేషన్లో కేసు బుక్ చేశారు. ఓటర్ టర్నౌట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని, రామ్‌టెక్.. దేవ్లాలీ నియోజకవర్గాల్లో అనూహ్యంగా ఓటర్లు 36 నుంచి 38 శాతానికి పెరిగారని, ఇక నాసిక్ వెస్ట్‌లో 47 శాతానికి, హింగ్నాలో 43 శాతానికి ఓటర్లు పెరిగినట్లు సంజయ్ కుమార్ తన పోస్టులో ఆరోపించారు.
ఆ పోస్టు ఆధారంగా ఓట్ల చోరీ జరిగినట్లు విపక్షాలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశాయి. అయితే రెండు రోజుల తర్వాత సంజయ్ కుమార్ తన ఎక్స్‌లో ఉన్న ఆ వివాదాస్పద పోస్టులను తొలగించారు. 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల డేటాను అంచనా వేయడంతో తమ బృందం తప్పు చేసినట్లు ఆయన అంగీకరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన ఆగస్టు 19వ తేదీన క్షమాపణలు చెబుతూ ఓ పోస్టు పెట్టారు.
ఎన్నికల విశ్లేషకుడు సంజయ్ కుమార్‌పై నాసిక్, నాగపూర్‌లో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని సుప్రీంకోర్టును సంజయ్ ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం సంజయ్ పిటీషన్‌ను స్వీకరించింది. అన్ని ఎఫ్ఐఆర్ల దర్యాప్తును ఆపేయాలని ధర్మాసనం స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసులోనే మహారాష్ట్ర సర్కారుకు నోటీసు ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి పిటీషన్లను ప్రోత్సహించమని సీజేఐ గవాయ్ అన్నారు.