న్యూఢిల్లీ: నీట్ తప్పిదాలకు కేంద్రం ఇకనైనా ముగింపు పలకాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇక ఇలా కొనసాగకూడదు అంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిశితంగా పర్యవేక్షించాలని నిర్ణయించింది.
దేశంలోనే అతిపెద్ద వైద్య ప్రవేశ పరీక్ష విశ్వసనీయతను కాపాడేందుకు ఒక బలమైన సంస్థాగత యంత్రాంగం ఏర్పాటయ్యేలా చూస్తామని, అలాగే ఏడాది పొడవునా సంస్కరణల పురోగతిని పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రశ్నపత్రాల లీకేజ్‌లను నివారించడానికి, పరీక్ష వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకోనున్న చర్యలను వివరిస్తూ సవివరమైన అఫిడవిట్‌ను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాత్కాలిక పరిష్కారాలు సరిపోవని, జాతీయ స్థాయి పరీక్షల పరిరక్షణ కోసం శాశ్వత యంత్రాంగం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.