న్యూఢిల్లీ: హిందూ దేవాలయాల్లో ప్రముఖులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, భగవంతుడిని ప్రత్యేకంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం, వీఐపీ దర్శనాల కోసం అదనపు రుసుమును వసూలు చేయడం ఆపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వకూడదనేది తమ అభిప్రాయమని, అయినప్పటికీ, ఎటువంటి ఆదేశాలనూ ఇవ్వలేమని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ చెప్పారు.
ఈ పిల్‌ను డిస్మిస్ చేసినంత మాత్రానికి అధికారులు తగిన చర్యలు చేపట్టడంపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. తమ వినతులపై హోం మంత్రిత్వ శాఖ స్పందించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల నిర్వహణ, పరిపాలనను పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో ఓ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.