న్యూఢిల్లీ: ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్యంతర బెయిల్‌ను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ నెల 7న ఈ అంశంపై విచారణ జరుపుతామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు తెలిపింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ అంశంపై సిద్ధంగా ఉండాలని ఈడీ న్యాయవాదికి సూచించింది. ‘మేం బెయిల్ మంజూరు చేయవచ్చు లేదా మంజూరు చేయకపోవచ్చు. దీని గురించి ఇరు వర్గాలు ఆశ్చర్యపోనవసరం లేదు’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే బెయిల్ అంశంపై ఇరు వర్గాల వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది.
కాగా, అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా ఇరుపక్షాలు భావించవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే ఇది సాధ్యమయ్యేలా ముందుకు రావాలని ఈడీని కోరింది. అలాగే కేజ్రీవాల్‌కు ఒకవేళ మధ్యంతర బెయిల్ మంజూరైతే ఆయనకు విధించే షరతులు, సీఎంగా ఏదైనా ఫైళ్లపై సంతకం చేయాలా వద్దా అన్న అంశాలను పరిశీలించాలని ఈడీని సుప్రీంకోర్టు కోరింది.