న్యూఢిల్లీ: కోర్టు గతంలో విధించిన శిక్ష వివరాలను నామినేషన్ ఫారమ్‌లో వెల్లడించకపోతే గెలిచిన అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రజాస్వామిక ప్రక్రియ సమగ్రతను పరిరక్షించేందుకు నామినేషన్ పత్రాలలో నిజాయితీగా అన్ని వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. మధ్యప్రదేశ్‌లోని భికన్‌గావ్ నగర పరిషద్‌లో కౌన్సిలర్‌గా ఎన్నికై అనర్హత వేటుకు గురైన పూనమ్ దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
తన ఎన్నికల నామినేషన్ పత్రంలో ఆమె గతంలో కోర్టు తనను దోషిగా తేల్చి విధించిన శిక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించనందుకు తన పదవిని కోల్పోయింది. చెక్ బౌన్సు కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు ఏడాది జైలు శిక్ష విధించడమేగాక నష్టపరిహారం చెల్లించాలని గతంలో ఆదేశించింది. ఈ వివరాలను తన నామినేషన్ పత్రంలో వెల్లడించనందుకు ఆమెపై అనర్హత వేటు పడింది. అనర్హత నుంచి రక్షణ కోరుతూ పూనమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమె అభ్యర్థనను కోర్ట్ తిరస్కరించింది.