న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం, 2025ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం మూడు అంశాలపై తన మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ బై కోర్ట్స్, వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బై డీడ్ కింద ప్రకటించిన ఆస్తులను గుర్తించే అధికారం కూడా ఈ మూడు అంశాలలో ఉంది. మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేయడానికి ముందు ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల వాదనలతోపాటు కేంద్రం వాదనలను వరుసగా మూడురోజులు ఆలకించింది.
వక్ఫ్(సవరణ) చట్టాన్ని గట్టిగా సమర్థించిన కేంద్రం వక్ఫ్ స్వరూపంలోనే లౌకిక భావన ఉందని, రాజ్యాంగబద్ధంగా చట్టం ఆమోదం పొందిందన్న భావన కూడా దానికి అనుకూలంగా ఉందని తెలిపింది. కాగా, పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ చారిత్రకంగా, చట్టపరంగా, రాజ్యాంగ సూత్రాల పరంగా ఈ చట్టానికి అర్హత లేదని వాదించారు.
చట్టరహిత ప్రక్రియ ద్వారా వక్ఫ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఈ చట్టం ఓ మార్గమని ఆయన పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులను ఓ పద్ధతి ప్రకారం స్వాధీనం చేసుకోవడానికి చేసిన చట్టంగా ఆయన దీన్ని అభివర్ణించారు. ఏ అంశాలను లేవనెత్తాలో ప్రభుత్వం నిర్దేశించలేదని ఆయన వాదించారు. ఈ దశలో వక్ఫ్ ఆస్తులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌కి చెందిన కూర్పు, కలెక్టర్ విచారణ జరుపుతున్న కాలంలో సంబంధిత ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకూడదన్న నిబంధన అనే మూడు అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.