Supreme Court : యాసిడ్ దాడి ఘటనల్లో బాధితులకు సాయం అందించేందుకు అవసరమైతే నిందితుల ఆస్తుల్ని ఎందుకు వేలం వేయకూడదో చెప్పాలని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బాధితులకు పునరావాసం, పరిహారం, చికిత్స వంటి వాటికోసం ఈ ఆస్తిని వాడుకోవచ్చు కదా అని సుప్రీం కోర్టు సూచించింది. యాసిడ్ దాడిలో గాయపడి, కోలుకున్న షహీన్ మాలిక్ అనే మహిళ 2009లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై స్పందించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. యాసిడ్ దాడి బాధితులకు కనీస పరిహారంగా అందిస్తున్న రూ.3 లక్షలు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈ పరిహారం పెంచేందుకు అవసరమైతే నిందితుల ఆస్తుల్ని జప్తు చేసి, వేలం ఎందుకు వేయకూడదో చెప్పాలని సూచించింది. యాసిడ్ దాడి ఘటనల్లో నిందితులకు అత్యంత కఠినమైన శిక్షలు వేయడం ద్వారా ఈ తరహా నేరాల్ని నియంత్రించాలని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు వ్యాఖ్యల ప్రకారం.. ప్రస్తుతం అందిస్తున్న మూడు లక్షల కనీస పరిహారం బాధితుల చికిత్స కోసం సరిపోదు. కొందరికి జీవిత కాల చికిత్స అవసరం. అలాగే పరిహారం, పునరావాసం వంటికి కూడా ఈ డబ్బులు సరిపోవు. అందుకే పరిహారం పెంచాలని, నిందితుల ఆస్తుల్ని జప్తు చేసి, వేలం వేసే విషయం గురించి ఆలోచించాలని సూచించింది.
ప్రతి బాధితురాలి కేసు వాదించేందుకు హైకోర్టులో టాప్ లాయర్‌ను నియమించాలని కూడా ఆదేశించింది. తాను యాసిడ్ దాడి కేసులో 16 ఏళ్లుగా పోరాడుతున్నానని, తనకు న్యాయం జరగలేదని, నిందితులంతా కింది కోర్టుల్లోనే విడుదలయ్యారని బాధితురాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ పోరాటంలో తాను జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయానని చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు తాజా సూచనలు చేసింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలు, బాధితుల వివరాలు, నిందితులకు పడ్డ శిక్ష వంటి వివరాలు సమర్పించాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.