న్యూఢిల్లీ: మలయాళం న్యూస్ ఛానల్ మీడియావన్(Mediaone)కు బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసే విషయంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఛానల్ను బ్యాన్ చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు(supreme court) తప్పుపట్టింది. లైసెన్సు రెన్యూవల్(license renewal) చేసేందుకు నిరాకరించిన ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు కొట్టిపారేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది. మీడియావన్ ఛానల్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉన్నట్లు సీల్డ్ కవర్లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీం ధర్మాసనం వ్యతిరేకించింది.
మైనార్టీలకు అనుకూలమైన వార్తలను ఆ ఛానల్లో ప్రస్తారం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) పేర్కొన్నదని, యూఏపీఏ, ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఆ ఛానల్ ప్రోగ్రామ్లను ప్రజెంట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయని, కానీ వాటిల్లో వాస్తవంలేదని, టెర్రరిస్టు లింకు(terrorist links)ల గురించి ఆ ఛానల్లో చూపించలేదని కోర్టు తెలిపింది. జాతీయ భద్రత(national security)కు ముప్పు ఉన్నట్లు గాలి మాటల ద్వారా చెప్పలేమని ధర్మాసనం తెలిపింది.