న్యూఢిల్లీ: అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) మైనారిటీ హోదాపై విచారణ బాధ్యతను నూతన ధర్మాసనానికి సుప్రీంకోర్టు శుక్రవారం అప్పగించింది. అయితే, ఏఎంయూను కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటు చేసినందువల్ల దానిని మైనారిటీ సంస్థగా పరిగణించరాదని 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం 4:3 మెజారిటీ తీర్పునిచ్చింది. ఏఎంయూకు మైనారిటీ హోదా ఇవ్వడానికి పరిశీలించవలసిన అంశాలను నిర్దేశించింది. ప్రస్తుత తీర్పులో నిర్దేశించిన అంశాల ఆధారంగా ఏఎంయూ మైనారిటీ విద్యా సంస్థ హోదాపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కేసు రికార్డులను రెగ్యులర్ బెంచ్‌కు సమర్పించాలని తెలిపింది. అలహాబాద్ హైకోర్టు 2006లో ఇచ్చిన తీర్పుపై అపీళ్లను ఆ బెంచ్ విచారిస్తుందని తెలిపింది.