న్యూఢిల్లీ: ప్రభుత్వాలు బిచ్చగాళ్ల కోసం సత్రాలను నిర్వహించడం దాతృత్వం కాదని, వాటి నిర్వహణలో రాజ్యాంగ విలువలు ప్రతిబింబించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇటువంటి కేంద్రాల్లో నిరంతరం హుందాతనంతో కూడిన జీవన పరిస్థితులు ఉండేలా చూడాలని కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలను ఆదేశించింది.
రాజ్యాంగం కల్పించిన గౌరవప్రదంగా జీవించే హక్కు సమాజంలో అత్యంత బలహీన వర్గాలైన బిచ్చగాళ్ల విషయంలో అమలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వాలు నిర్వహించే యాచక గృహాలు, అటువంటి ఇతర సంస్థల్లో మానవీయ పరిస్థితులను కల్పించడంలో విఫలమవడం అసమర్థ, నిర్లక్ష్య పరిపాలన అవుతుందని వివరించింది.