Siddaramaiah : కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు ఇచ్చింది . 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కె శంకర అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని సిద్ధరామయ్యను ఆదేశిస్తూ కోర్టు ఇవాళ నోటీసులు జారీచేసింది.
కాగా 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం సిద్ధరామయ్య అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషనర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దాంతో పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఇవాళ సిద్ధరామయ్యకు నోటీసులు జారీచేసింది.
ఒకవైపు కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు తీవ్ర స్థాయిలో చక్కర్లు కొడుతున్న వేళ సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్‌కు ఆర్థిక నేరాల విభాగం (EOW) నోటీసులు జారీచేసింది. ఆర్థిక విషయాలు, లావాదేవీలపై శివకుమార్ వివరణ కోరుతూ EOW నోటీసులు ఇచ్చింది.