Supreme Court | బైజూస్ కేసులో ఎన్సీఎల్ఏటీ నిర్ణయానికి వ్యతిరేకంగా యూఎస్ ఆధారిత రుణదాత గ్లాస్ ట్రస్ట్ చేసుకున్న అప్పీల్‌పై ఈ నెల 17న సర్వోన్నత న్యాయస్థానం విచారించనున్నది. ఈ మేరకు బుధవారం ధర్మాసనం అంగీకరించింది. ఎడ్ టెక్ కంపెనీ బైజూస్‌కు వ్యతిరేకంగా బీసీసీఐ బకాయిల వ్యవహారంలో రూ.158.9కోట్ల బకాయిల సెటిల్మెంట్ను ఆమోదించిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనాన్ని న్యాయవాదుల బృందం కోరింది. బైజూస్ తరఫున సీనియర్ న్యాయవాది ఎన్కే కౌల్ పిటిషన్‌పై ప్రస్తావిస్తూ.. వీలైనంత త్వరగా ఈ అంశంపై విచారించాలని కోరారు. బీసీసీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో మరో పిటిషన్ సైతం దాఖలైంది.
ఈ నెల 17న విచారణ జరుగుతుందని, కాబట్టి ప్రస్తుత పిటిషన్‌ను ఒకే రోజు విచారించాలని.. ఈ రెండు కేసులను శుక్రవారం విచారించాలని కౌల్ విజ్ఞప్తి చేశారు. ఈ రెండు పిటిషన్లను 17న విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసులను సెప్టెంబర్ 17న కలిసి విచారిస్తామని అమెరికాకు చెందిన రుణదాత తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. అయితే, ఆగస్టు 22న ఎడ్ టెక్ సంస్థపై దివాలా చర్యలకు సంబంధించి రుణదాతల కమిటీ (CEC) ఎలాంటి సమావేశాన్ని నిర్వహించకుండా ఉండేందుకు బెంచ్ నిరాకరించింది. పిటిషన్‌పై విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది. ఈ మధ్యకాలంలో ఎలాంటి పరిణామాలు జరిగినా.. అప్పీలేట్ ఇన్సాల్వెన్సీ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికా రుణదాత చేసిన అప్పీల్‌కు ఎలాంటి అర్హత లేదని తేలితే వాటిని విస్మరించవచ్చని బెంచ్ పేర్కొంది. దివాలా ప్రక్రియలో రుణదాతల కమిటీని ఏర్పాటు చేయకుండా దివాలా పరిష్కార ప్రొఫెషనల్ (IPR) నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వును ఆమోదించడానికి సుప్రీం కోర్టు కూడా నిరాకరించింది.