MLAs Defection | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): సముచిత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంతకాలమో డిక్షనరీ (నిఘంటువు) చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదు అందుకుని ఏకంగా పది నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకుని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏమిటని ఆక్షేపించింది. మనం ప్రజాసామ్యంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది.
ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశమని గుర్తు చేసింది. చట్టసభకు ఒక పార్టీ తరఫున గెలుపొంది మరోపార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకొనే విషయమై కాలయాపన సబబు కాదని హితవు చెప్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నెలలుగా అంటే గత ఏడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదులను అందుకుంటే ఇప్పటివరకు వాటిపై ఎలాంటి పురోగతి ఉందో చెప్పడానికి రీజనబుల్ టైం కావాలని కోరడం తగదని వ్యాఖ్యానించింది.
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి..’ అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్‌ను, మరికొందరు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఒకదశలో అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్‌ను సంప్రదించి తెలుసుకొని రేపే (మంగళవారం) వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే వినోద్చంద్రన్తో కూడిన ధర్మాసనం చెప్పింది. వెంటనే జోక్యం అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తమకు కనీసం మూడునాలుగు రోజులపాటు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది.
అంతకుముందు అసెంబ్లీ కార్యదర్శి తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నుంచి సమాచారం తెలుసుకుని చెప్పేందుకు మ రింత సమయం కావాలని కోరారు. స్పీకర్‌తో అసెంబ్లీ కార్యదర్శి చర్చించి వివరాలు తెలుసుకొని చెప్పేందుకు రెండు వారాల గడువు కావాలన్నారు. సంపత్‌కుమార్, సుభాష్దేశాయ్ కేసుల్లో సుప్రీంకోర్టు.. స్పీకర్ రీజనబుల్ టైంలోగా చర్యలు తీసుకోవాలని చెప్పిందని, ఆ సముచిత సమయాన్ని తేల్చాల్సింది స్పీకరేనని చెప్పారు. స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఒకటే లేదని, ఇతరత్రా చాలా విధులను స్పీకర్ నిర్వర్తిస్తారని అన్నారు. దీనిపై కల్పించుకున్న ధర్మాసనం.. ఇప్పటికే 10 నెలలైందని, ఇం కెంత గడువు కావాలని ప్రశ్నించింది.
పిటిషనర్ల తరఫున హాజరైన ఇతర సీనియర్ న్యాయవాదులు అర్యమ సుందరం, నాయుడు, మోహిత్‌రావు తమ వాదనలు వినిపిస్తూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసి పది నెలలైనప్పటికీ స్పీకర్ స్పందించడం లేదని తెలిపారు. పార్టీ ఫిరాయింపులు బాహాటంగానే జరుగుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ఎజెండాపై గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలపై గత ఏడాది మార్చిలో ఫిర్యాదు చేస్తే నేటికీ చర్యలు శూన్యమన్నారు. ఒక ఎమ్మెల్యే (దానం నాగేందర్) అయితే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే (కడియం శ్రీహరి) కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుని తన కూతురును ఎంపీగా గెలిపించేందుకు బాహాటంగా ప్రచారం చేశారని చెప్పారు.
ఇలాంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచినట్లు అవుతుందని, ప్రజాస్వామ్యం మంటగలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేండ్ల చట్టసభ పదవీ కాలం పూర్తయ్యే వరకు కాలయాపన చేయడానికి వీల్లేదని అన్నారు. రీజనబుల్ టైంకు నిర్దిష్ట గడువు ఉంటుందని చెప్పారు. మూడు నెలల్లోగా స్పీకర్ తన ముందున్న ఫిర్యాదులను పరిషరించాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమలుచేయాలని కోరారు. వాయిదాల పేరుతో చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేయడం సరికాదన్నారు.