Supreme Court | అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషనర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు మందలించింది. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే అంశంలో ఈ పిటిషన్ మూడోదని.. దీన్ని అత్యవసర విచారణ కోసం జాబితా చేయాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎదుట న్యాయవాది మాథ్యూస్ నెడుంపారా కోరారు. ఇప్పుడు కొట్టివేయమంటారా? అని ప్రశ్నించారు. పిటిషన్‌ను తగిన సమయంలోనే జాబితా చేస్తామని సీజేఐ తెలిపారు.
న్యాయవాది నెడుంపారా మాట్లాడుతూ పిటిషన్‌ను కొట్టివేయడం అసాధ్యమని.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలన్నారు. అయితే, హైకోర్టు న్యాయమూర్తిని వర్మ అని ఏకవచనంతో న్యాయవాది సంబోధించడంతో ధర్మాసనం సీనియస్‌గా తీసుకుంది. ‘ఆయనకు మీకు స్నేహితుడా? ఆయన ఇప్పటికే జస్టిస్ వర్మే. మీరు ఆయనను అలా ఎలా సంబోంధిస్తున్నారు? కొంత మర్యాద ఇవ్వండి. మీరు ఓ న్యాయమూర్తిని అలా సూచిస్తున్నారు. అతను ఇప్పటికీ న్యాయమూర్తే’ అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. దానికి న్యాయవాది బదులిస్తూ ‘ఈ గొప్పదనం ఆయనకు వర్తించదని అనుకున్నారు. పిటిషన్‌ను జాబితా చేయండి’ అని పేర్కొనగా.. సీజేఐ స్పందిస్తూ ‘మీరు కోర్టుకు దిశానిర్దేశం చేయొద్దు’ అంటూ సీజేఐ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా అంతర్గత దర్యాప్తు నకమిటీ నివేదికను సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విచారణ కమిటీ నివేదికను కొట్టివేయాలని జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును కోరారు. కమిటీ నివేదిక తన హక్కులను ఉల్లంఘించిందని, కమిటీ రిపోర్టు ఆధారంగా తనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలన్న మాజీ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచనను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను పరిశీలించకుండానే విచారణ కమిటీ తుది నిర్ణయానికి వచ్చిందని, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్‌ను తనపై మోపడం తప్పని పేర్కొన్నారు. కమిటీ అభిప్రాయాలను తప్పని నిరూపించాల్సిన బాధ్యతను తప్పుగా తనపై మోపారని ఆరోపించారు. తనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలన్న సూచనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. ఆయనపై అభిశంసనకు మార్గం సుగమమైంది. అభిశంసనకు సంబంధించిన మోషన్‌పై సభ్యులు సంతకాలు చేశారు.