Supreme Court | న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దుందుడుకుగా బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడుతుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆక్రమణల తొలగింపు పేరుతో సాగిస్తున్న ఈ బుల్డోజర్ జస్టిస్‌ను వచ్చే నెల 1 వరకు ఆపాలని అన్ని రాష్ర్టాలను మంగళవారం ఆదేశించింది. నిందితుల ఆస్తులతో సహా ఎటువంటి ఆస్తినీ తన అనుమతి లేకుండా కూల్చవద్దని స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా కనీసం ఒక ఇంటిని కూల్చివేయడమైనా అది రాజ్యాంగ ఆత్మ, లక్షణాలకు వ్యతిరేకమని స్పష్టంచేసింది. అయితే, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, చెరువులు వంటి బహిరంగ ప్రదేశాల్లోని అనధికారిక నిర్మాణాలకు ఈ ఆదేశాలు వర్తించబోవని తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది. చాలా రాష్ర్టాల్లో ఇళ్లు, ఇతర భవనాలను చట్టవిరుద్ధంగా కూల్చేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు వీటిని ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యమవుతుందన్న ప్రభుత్వ వాదనను కోర్టు కొట్టివేసింది. ‘వచ్చే విచారణ వరకు మీ చర్యలను ఆపాలని మేం కోరినంత మాత్రాన మిన్ను విరిగి మీద పడదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇదే అంశంపై ఈ నెల 2న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై వచ్చిన స్పందనలను మంగళవారం ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా అమలు చేయదగిన మార్గదర్శకాలను జారీ చేస్తామని ఈ నెల 2న చెప్పింది. దీనిపై స్పందిస్తూ వచ్చిన స్టేట్మెంట్లలో, బుల్డోజర్ కొనసాగుతుందని, స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందనే దానిపై అది ఆధారపడుతుందని అన్నారని గుర్తు చేసింది. సొలిసిటర్ జనరల్ మెహతాను ఉద్దేశించి న్యాయమూర్తులు మాట్లాడుతూ, ‘ఈ మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాత, ఈ ప్రాక్టీస్‌ను ఘనత చాటుకోవడం, హీరోయిజంగా చూపే యత్నంపై మీ సహాయం కోరుతాం. దీనిని ఎలా ఆపాలో మీరు మాకు సహాయపడుదురుగాని. అవసరమైతే, ఎన్నికల కమిషన్‌ను కూడా అడుగుతాం” అని చెప్పారు. ఆ సమయంలో పిటిషనర్ల తరపున హాజరైన న్యాయవాది ఒకరు మాట్లాడుతూ, ఈ నెల 2న విచారణ సందర్భంగా ఆదేశాలను ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా దేశంలో కూల్చివేతలు కొనసాగాయని చెప్పారు.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, నిర్మాణాల కూల్చివేతలపై ఓ కథనాన్ని రూపొందిస్తున్నారని అన్నారు. ఓ మతానికి చెందిన వాడైనందువల్ల అతని ఇంటిని కూల్చేశారని ఆరోపిస్తున్న పిటిషన్ సుప్రీంకోర్టు ముందు ఉందన్నారు. చట్టాన్ని పాటించకుండా కూల్చివేసిన ఒక ఉదాహరణను కోర్ట్ దృష్టికి తీసుకురమ్మనండి అని అన్నారు. ప్రభావిత వ్యక్తులకు తమ నిర్మాణాలు చట్టవిరుద్ధమని, తమకు నోటీసులు వచ్చాయని తెలుసునని, అందుకే వారు కోర్టును ఆశ్రయించడం లేదని చెప్పారు. ఓ భావాన్ని రూపొందిస్తున్నారని మెహతా చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందిస్తూ, ‘బయటి గలాభా మమ్మల్ని ప్రభావితం చేయజాలదని హామీ ఇస్తున్నాం’ అని స్పష్టం చేసింది.