మేజర్ అయ్యే దాకా తండ్రిదే బాధ్యత
విడాకుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: భార్యాభర్తల మధ్య గొడవ ఏదైనప్పటికీ దాని వల్ల వారి పిల్లలు నలిగిపోకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరు విడాకులు తీసుకొన్నప్పటికీ పిల్లలు మేజర్ అయ్యేదాకా వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత తండ్రిపై ఉందని స్పష్టం చేసింది. ఓ ఆర్మీ అధికారికి 2005 నవంబర్ 16న పెండ్లి అయింది. వీరికి ఒక కుమారుడు. వయసు 13 ఏండ్లు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరూ 2011 నుంచి విడిగా ఉంటున్నారు. అధికారి మరో వివాహం చేసుకొన్నారు. తన మొదటి వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొడుకు మేజర్ అయ్యే దాకా అతడి బాగోగుల కోసం తల్లికి నెలకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇది 2019 డిసెంబర్ నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది.