న్యూఢిల్లీ: ఎర్రకోట(Red Fort)పై దాఖలైన దావాను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొఘల్ సామ్రాజ్యానికి చెందిన చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసురాలిగా చెప్పుకుంటున్న సుల్తానా బేగమ్ సుప్రీంకోర్టులో ఓ పిల్ వేసింది. ఢిల్లీలోని ఎర్రకోటను అప్పగించాలని ఆమె తన పిటీషన్లో కోరింది. అయితే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం సుల్తానా బేగం దాఖలు చేసిన పిటీషన్‌ను తిరస్కరించింది. ఆ దావా పూర్తిగా తప్పుదోవ పట్టించే రీతిలో ఉందని ధర్మాసనం తెలిపింది. ఒక్క ఎర్ర కోటే ఎందుకు, ఫతేఫుర్ సిక్రీ వద్దా, పిటీషన్ తప్పుడుగా ఉందని, దాన్ని డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టు చెప్పింది.
2021లో తొలిసారి సుల్తానా బేగం హైకోర్టును ఆశ్రయించింది. రెండవ బహదూర్ షా జాఫర్ ముని మనవడికి చెందిన భార్యను అని ఆమె తన పిటీషన్లో పేర్కొన్నది. 1857లో స్వాతంత్ర్య సమరం ప్రారంభమైన సమయంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఆ తర్వాత బహదూర్ షా జాఫర్‌ను దేశం నుంచి తరిమేశారని, మొఘల్స్ ఆస్తుల్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాపర్టీ భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నదని, అందుకే ఆ ప్రాపర్టీని తమకు అప్పగించాలని సుల్తానా కోర్టులో కేసు దాఖలు చేసింది.
డిసెంబర్ 2021లో సింగిల్ జడ్జీ ఈ పిటీషన్ కొట్టివేశారు. 164 ఏళ్లుగా ఆ ప్రాపర్టీ ఇతరుల ఆధీనంలో ఉందని తెలిసి ఇన్నాళ్లూ ఎందుకు జాప్యం చేసినట్లు సింగిల్ జడ్జీ ప్రశ్నించారు. కేసు ఫైల్ చేయడంలో ఆలస్యమైనట్లు హైకోర్టు అప్పట్లోనే పేర్కొన్నది