న్యూఢిల్లీ, జూలై 30: న్యాయ విద్య పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్స్‌ను న్యాయవాదులుగా నమోదుచేసుకోవడానికి రాష్ర్టాల్లోని బార్ కౌన్సిల్స్ అధిక రుసుము వసూలు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది న్యాయవాద వృత్తిలో అణగారిన, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమాన భాగస్వామ్యంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 22న రిజర్వ్ చేసిన తీర్పును, సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వెలువరించింది. న్యాయవాదుల చట్టం-సెక్షన్ 24 ప్రకారం, ఎన్రోల్మెంట్ ఫీజుగా జనరల్ క్యాటగిరీ కింద రూ.650, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీకి రూ.125 మాత్రమే వసూలు చేయాలని, అంతకు మించి వసూలు చేయరాదని ధర్మాసనం పేర్కొన్నది. ‘ఎన్రోల్మెంట్ ఫీ, స్టాంప్ డ్యూటీ తప్ప.. అంతకు మించి రాష్ర్టాల్లోని బార్ కౌన్సిల్స్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వసూలు చేయకూడదు. ముందస్తు షరతులు విధించరాదు’ అని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళ రాష్ర్టాల్లోని బార్ కౌన్సిల్స్ ఎన్రోల్మెంట్ ఫీగా అధిక రుసుములు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ కొంతమంది న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.