న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: రాజ్యాంగంలోని 200 అధికరణ కింద రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి గవర్నర్‌కు ఉన్న అధికారాలు, బాధ్యతలపై సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రజల ప్రజాస్వామిక అభీష్టాన్ని దెబ్బతీయవద్దని గవర్నర్లను హెచ్చరించిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలహరణం చేస్తున్న గవర్నర్ల వ్యవహార శైలికి అడ్డుకట్ట వేసేందుకు బిల్లులకు ఆమోదం తెలపడంలో నిర్దిష్ట కాల వ్యవధిని విధించింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తన వద్దే ఉంచుకోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.
గవర్నర్ చర్యను సవాలు చేస్తూ డీఎంకే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం వెలువరించిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడంలో గవర్నర్లకు రాజ్యాంగపరమైన కాలవ్యవధి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పది బిల్లులను తమిళనాడు గవర్నర్ పెండింగ్‌లో ఉంచడాన్ని చట్ట విరుద్ధం, ఏకపక్షంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై దేశంలోని గవర్నర్లు సమ్మతి తెలిపేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీచేసింది. బిల్లులపై సమ్మతి తెలియచేయకుండా శాశ్వతంగా పెండింగ్‌లో ఉంచే అధికారం గవర్నర్లకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్లకు మూడు అవకాశాలు మాత్రమే ఉంటాయని, ఒకటి బిల్లుకు సమ్మతి తెలియచేయడం, రెండు అభ్యంతరాలతో అసెంబ్లీకి బిల్లును తిప్పిపంపడం, మూడు రాష్ట్రపతికి నివేదించడమని సుప్రీంకోర్టు తెలిపింది.
కాల వ్యవధిపై నిర్దేశం
రాజ్యాంగంలోని 200 అధికరణ కింద పనిచేయాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉందని కోర్టు తెలిపింది. ఒక బిల్లుపై సమ్మతిని ఆపాలన్నా లేదా అభ్యంతరాలు ఉండి రాష్ట్రపతికి నివేదించాలన్నా నెల రోజుల్లోగా గవర్నర్లు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. బిల్లుపై తమ అభ్యంతరాలను తెలియచేస్తూ గవర్నర్లు 3 నెలల్లోగా అసెంబ్లీకి వాపసు చేయాల్సి ఉంటుంది. బిల్లుపై తన అభ్యంతరాలను రాష్ట్రపతికి తెలియచేయాలనుకుంటే గరిష్ఠంగా మూడు నెలల్లో ఆ పని చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు నెల రోజుల్లోగా గవర్నర్లు తమ సమ్మతిని తెలియచేయాల్సి ఉంటుంది. గవర్నర్లు సత్వరంగా చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తుందని, నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం ప్రజాస్వామ్య పాలన స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగపరంగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి చర్యల కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఈ మార్గదర్శకాలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది.
బిల్లులకు సమ్మతి తెలియజేయకుండా నిరవధికంగా పెండింగ్‌లో ఉంచే అధికారం గవర్నర్‌కు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును పునఃపరిశీలనకు పంపాక అసెంబ్లీ మళ్లీ ఆమోదించి రెండవసారి ఆ బిల్లును గవర్నర్‌కు పంపించిన పక్షంలో అటువంటి బిల్లును గవర్నర్ రాష్ట్రపతికి నివేదించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా చేయడం చట్టవిరుద్ధమని తెలిపింది. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే నెలరోజుల్లోగా దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం లేదని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. బిల్లులను శాశ్వతంగా పెండింగ్‌లో ఉంచడం ఏకపక్ష చర్యగా పేర్కొన్న ధర్మాసనం.. ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్లు తమ వద్దనే బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో ఉంచుకోవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదని తెలిపింది.
ఆ బిల్లులే రాష్ట్రపతికి సిఫార్సు
ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలు, రాష్ట్రపతి సమ్మతి అవసరమని భావించే అంశాల విషయంలో గవర్నర్లు విచక్షణాధికారంతో వ్యవహరించవచ్చని, 200 అధికరణ ఆ అధికారాలను గవర్నర్‌కు కల్పించిందని ధర్మాసనం వివరించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై గవర్నర్లు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండలేరని, వాటిని నెల రోజుల్లోగా తిప్పిపంపి మళ్లీ అసెంబ్లీ ఆమోదం పొందేలా మాత్రమే గవర్నర్ నిర్ణయం తీసుకోగలరని సుప్రీంకోర్టు తెలిపింది. అసెంబ్లీ మరోసారి ఆమోదించి పంపించిన తర్వాత ఆ బిల్లును తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
గవర్నర్ల తీరుకు ఈ తీర్పు హెచ్చరిక: విజయన్
బిల్లుల పెండింగ్‌పై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హర్షం వ్యక్తం చేశారు. ఫెడరల్ వ్యవస్థను, రాష్ట్ర అసెంబ్లీ ప్రజాస్వామిక హక్కులను సుప్రీంకోర్టు తీర్పు పరిరక్షించిందని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్ సూచన మేరకు గవర్నర్లు పనిచేయాల్సి ఉంటుందని న్యాయస్థానాలు పదేపదే స్పష్టం చేశాయని ఆయన తెలిపారు. బిల్లుల ఆమోదానికి నిర్దిష్ట కాలవ్యవధిని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించడాన్ని ఆయన స్వాగతించారు. రాష్ట్ర శాసనసభల అధికారాలను చేజిక్కించుకోవాలని చూస్తున్న గవర్నర్ల తీరుకు ఈ తీర్పు హెచ్చరికని విజయన్ పేర్కొన్నారు. ఈ తీర్పును ప్రజాస్వామిక విజయంగా ఆయన అభివర్ణించారు.
ఇది రాష్ట్ర ప్రభుత్వాల విజయం: స్టాలిన్
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సమ్మతి తెలియచేయకుండా తమిళనాడు గవర్నర్ రవి పెండింగ్‌లో ఉంచడంపై సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పును సీఎం స్టాలిన్ స్వాగతించారు. ఈ తీర్పును చారిత్రాత్మకంగా అభివర్ణించిన స్టాలిన్.. ఇది రాష్ట్ర ప్రభుత్వాల విజయంగా పేర్కొన్నారు. బిల్లులకు గవర్నర్ సమ్మతి తెలియచేసినట్టు పరిగణించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొందని అసెంబ్లీలో మాట్లాడుతూ స్టాలిన్ తెలిపారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు న్యాయ పోరాటం మరోమారు యావద్దేశానికి వెలుగు చూపిందన్నారు. 10 బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచడం చట్ట విరుద్ధమని, తప్పిదమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు.
న్యాయ సమీక్షకు గవర్నర్ చర్యలు
రాష్ట్రపతి సమ్మతి తప్పనిసరి కాదన్నంత మాత్రాన గవర్నర్ చర్యలు న్యాయ సమీక్ష నుంచి రక్షణ పొందినట్టు కాదని, గవర్నర్ చర్యలు తీసుకున్నా, తీసుకోకున్నా రాజ్యాంగ పరిధికి, ప్రజాస్వామ్య నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తారని సుప్రీంకోర్టు గుర్తు చేస్తూ రాష్ర్టానికి రాజ్యాంగాధినేతగా ఉండే గవర్నర్ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులకు అడ్డుంకులు సృష్టించకుండా ప్రజా సంక్షేమానికి అనుగుణంగా పనిచేయాలని ధర్మాసనం హితవు పలికింది.