Supreme Court | న్యూఢిల్లీ, మార్చి 26: పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరమని సుప్రీంకోర్టు బుధవారం అభిప్రాయపడింది. చట్టవిరుద్ధంగా నరికిన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని ఓ వ్యక్తిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రక్షిత తాజ్ చతుర్భుజ జోన్లో 454 చెట్లను నరకివేసిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
పర్యావరణానికి సంబంధించిన విషయంలో క్షమాభిక్ష ప్రసక్తి ఉండరాదని, పెద్ద సంఖ్యలో చెట్లను నరకివేయడం మనుషులను చంపడం కన్నా ఘోరమని ధర్మాసనం అభిప్రాయపడింది. 454 చెట్లు కల్పించే పచ్చదనాన్ని తిరిగి సృష్టించడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర-బృందావన్‌లోని దాల్మియా వ్యవసాయ క్షేత్రంలో 454 చెట్లను నరికివేసిన శివశంకర్ అగర్వాల్ అనే వ్యక్తికి చెట్టుకు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించాలన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించింది. సమీపంలోని స్థలంలో అగర్వాల్ మళ్లీ చెట్లను నాటాలని, ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కార కేసును ఆ తర్వాతే కొట్టివేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.