న్యూఢిల్లీ, మే 27 : నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాది వీ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ బుధవారం కొలీజియం సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సారథ్యంలో కొలీజియం సమావేశాలు మే 22, మే 27 తేదీలలో జరిగినట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్ తన తాజా ప్రకటనలో పేర్కొన్నది.
పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ సచ్దేవ, జమ్ము కశ్మీరు, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు సంఖ్యాబలం సీజేఐతో కలుపుకొని 32గా ఉంది. వచ్చే నెలలో ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు ఉద్యోగ విరమణ చేయనున్నారు.