న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ యూట్యూబ్ షోలో పాల్గొన్న సమయ్ రైనాను ఉద్దేశించి రణ్వీర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘నీ వ్యాఖ్యలు నీ వక్ర మనస్తత్వాన్ని చూపుతున్నాయి’ అని వ్యాఖ్యానించింది. సమయ్ రైనాను అతని తల్లిదండ్రులు, శృంగారం గురించి ప్రశ్నిస్తూ రణ్వీర్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కాగా పలు రాష్ర్టాల్లో అతనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీంతో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ ఒకేచోట చేర్చి విచారణ జరపాలని, తనను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రణ్వీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
దీనిపై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘నీ మనసులో ఉన్న చెత్తను యూట్యూబ్ షోలో వెళ్లగక్కావు. నీవు వాడిన పదాలు ఈ దేశపు కుమార్తెలు, సోదరీమణులు, తల్లిదండ్రులను, సమాజాన్ని కూడా సిగ్గుపడేలా చేశాయి. ఇది నీ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నది’ అంటూ న్యాయమూర్తులు మండిపడ్డారు. ‘సమాజంలో ఉన్న విలువలేమిటి? ఆ విలువలకున్న ప్రమాణాలేమిటో నీకు తెలుసా? వాక్ స్వాతంత్య్రం పేరిట సమాజ నియమాలకు విరుద్ధంగా ఏది పడితే అది మాట్లాడేందుకు ఎవరికీ లైసెన్స్ లేదు’ అని స్పష్టంచేసింది. అతనికి వ్యతిరేకంగా అనేక సంఖ్యలో నమోదైన ఎఫ్ఐఆర్లను, అతనికి వస్తున్న బెదిరింపులను దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరుచేస్తున్నట్టు తెలిపింది. ఇకపై అతని మీద ఎఫ్ఐఆర్లను నమోదు చేయరాదని కోర్టు ఆదేశించింది. అల్హాబాదియావి, అతని అనుచరుల ప్రదర్శనలను యూట్యూబ్‌లో ప్రసారం చేయరాదని ఆదేశించింది. అల్హాబాదియా తన పాస్‌పోర్టును ఠాణె పోలిస్స్టేషన్లో జప్తు
చేయాలని ఆదేశించింది.