Supreme Court | న్యూఢిల్లీ: కోచింగ్ సెంటర్లు ‘డెత్ చాంబర్లు’గా మారాయని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఢిల్లీలోని పాత రాజిందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ముగ్గురు విద్యార్థులు మరణించడంపై స్వీయ విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. ఈ సంఘటన అందరికీ మేలుకొలుపు అని వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నోటీసులు ఇచ్చింది. అవసరమైతే ఈ కోచింగ్ సెంటర్లను మూసేయాలని ఆదేశిస్తామని ధర్మాసనం ఈ సందర్భంగా హెచ్చరించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో వచ్చి, కఠోరంగా శ్రమించే విద్యార్థుల పట్ల శిక్షణా కేంద్రాలు ‘డెత్ ఛాంబర్లు’గా మారాయని ఆవేదన వ్యక్తం చేసింది. కెరీర్ కోసం ఈ శిక్షణ కేంద్రంలో చేరిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అందరికీ కండ్లు తెరిపించే సంఘటన అని తెలిపింది. అందుకే ఈ విచారణ పరిధిని విస్తరించాలని భావిస్తున్నామని చెప్పింది. ఈ శిక్షణ కేంద్రాలకు జారీ చేసిన నిబంధనలు ఏమిటి? వాటిని అవి అమలు చేసేలా పర్యవేక్షించే యంత్రాంగం ఏమిటో తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2023 డిసెంబరులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ శిక్షణ సంస్థల సంఘం చేసిన అప్పీలుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కేసును స్వీయ విచారణకు చేపట్టింది. అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు నిబంధనల ప్రకారం తగిన భద్రతా చర్యలు అమలవుతున్నాయో, లేదో పరిశీలించాలని ఢిల్లీ నగర పాలక సంస్థను, అగ్నిమాపక శాఖను హైకోర్టు అప్పట్లో ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ శిక్షణ సంస్థల సంఘం అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఖర్చుల కింద రూ.1 లక్ష చెల్లించాలని ఈ సంఘాన్ని ఆదేశించింది. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి నిర్దేశించిన భద్రతా చర్యలను, ఇతర నిబంధనలను పాటించకుండా శిక్షణ సంస్థలు పని చేయడానికి అనుమతించరాదని స్పష్టం చేసింది.