న్యూఢిల్లీ : ఏ న్యాయస్థానం కూడా ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలని మహిళను, అందునా ఒక బాలికను బలవంతం చేయలేదని పేర్కొన్న సుప్రీం కోర్టు ఏడు నెలల తన గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకోవడానికి 15 ఏండ్ల బాలికకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జన్మించబోయే బిడ్డ ఎంపిక కంటే.. గర్భం దాల్చిన బాలికకే ప్రాధాన్యత ఉంటుందని, అటువంటి గర్భాన్ని కొనసాగించడం వల్ల మైనర్ మానసిక ఆరోగ్యం, విద్యావకాశాలు, సామాజిక హోదా, వివాహంపై దుష్ప్రభావాలు పడే అవకాశం ఉందని జస్టిస్‌లు బీవీ నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.
మహిళ పునరుత్పత్తి స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అదే సమయంలో.. ఇష్టంలేని గర్భాన్ని మోస్తున్న మహిళను దానిని కొనసాగించాలని బలవంతం చేస్తే అది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. ఈ కేసులో మైనర్ అవాంఛితంగా వచ్చిన గర్భాన్ని కొనసాగించాలని అనుకోవడం లేదని, ఈ విషయం ఆమె రెండుసార్లు ఆత్మహత్యా యత్నాల ద్వారా వెల్లడైందని ధర్మాసనం పేర్కొన్నది.