న్యూఢిల్లీ, జూలై 18: ఫ్యాక్ట్-చెకర్ మహమ్మద్ జుబేర్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. కేసుల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అతడి అరెస్టుల వెనుక ‘విషవలయం’ ఉన్నట్టు అభిప్రాయపడింది. జుబేర్‌పై దాఖలైన ఐదు కేసుల విషయంలో తాము తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని యూపీ పోలీసులను ఆదేశించింది. ఆరో కేసులో ఇదివరకే బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సీతాపూర్, లఖింపూర్‌ఖేరీ, గాజియాబాద్, ముజఫర్‌నగర్, హత్రాస్ జిల్లాల్లో నమోదైన ఆరు ఎఫ్‌ఐర్‌లను రద్దు చేయాలని జుబేర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వాటన్నిటిలో ప్రాథమిక ఆరోపణ మతపరమైన భావాలను గాయపర్చారనే. కొన్ని ఇతర నేరాలను కూడా ఎఫ్ఐఆర్లలో ప్రస్తావించారు. ‘ఇలా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడానికి ముగింపు పలకాలి. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమే’ అని జుబేర్ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ కోర్టుకు నివేదించారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్నివేదనపై 20న విచారణ జరుపుతామని పేర్కొన్నది. అంతవరకు పరిస్థితిని జటిలం చేసే చర్యలేవీ అతనిపై చేపట్టవద్దని యూపీ పోలీసులకు స్పష్టం చేసింది. ఇతర కోర్టులు ఆదేశాలు జారీచేయడంపై ఎలాంటి నిలిపివేత వద్దని యూపీ తరఫు న్యాయవాది కోరినప్పుడు న్యాయమూర్తి చంద్రచూడ్ అందుకు నిరాకరించారు. ‘సమస్య ఏమిటంటే ఇదొక విషవలయం.. ఒక కేసులో మధ్యంతర బెయిల్ లభిస్తే ఇంకొ క కేసులో అరెస్టు చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వలయం ఫ్యాక్ట్-చెకింగ్ సైట్ ఆల్ట్-న్యూస్ సహవ్యవస్థాపకుడైన జుబేర్‌పై ఢిల్లీలో మొదలైంది. నాలుగేండ్ల నాటి ట్వీట్లో 1983 నాటి సినిమా దృశ్యం ఉపయోగించినందుకు అరెస్టు చేశారు. ఆ తర్వాత హిందూ మతవాద నాయకులను ‘విద్వేష ప్రచారకులని’ ఆరోపించినందుకు యూపీలోని సీతాపూర్‌లో అరెస్టు చేశారు. ఢిల్లీ కేసులో జిల్లా జడ్జి నుంచి బెయిల్ లభించింది. సీతాపూర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ వచ్చిం ది. హత్రాస్ కేసులో ప్రస్తుతం అరెస్టు కింద ఉన్నారు. సోమవారం స్థానిక న్యాయస్థానంలో విచారణ ఉండింది.
యూపీ పోలీసులు మొత్తం ఆరు కేసులకు కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వాటన్నటినీ కొట్టివేయాలని జుబేర్ ధర్మాసనాన్ని అర్థిస్తున్నాడు. ఆయన తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ తక్షణ ఉపశమనం వేడుకోగా న్యాయమూర్తి చంద్రచూడ్ ‘సీతాపూర్ కేసులో ఊరట కల్పించాంం కదా’ అన్నారు. అప్పుడు న్యాయవాది మొత్తం ఆరు కేసులు ఉన్నాయని, కొన్ని గత ఏడాది కేసులని చెప్పారు. కొన్నిటిలో ఆయనను జుడీషియల్ కస్టడీకి పంపారని, ఆయన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ‘ఈరోజు హత్రాస్ కేసులో 14 రోజుల రిమాండును అడుగుతున్నారు’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రస్తుత కేసు విచారణకు తొందర ఏమున్నదని అన్నారు. మతోన్మాద ప్రకటనలతో చేసిన ఫిర్యాదుల ఆధారంగా జుబేర్‌పై చర్యలు తీసుకుంటున్నారని, జర్నలిస్టులను శిక్షించేందుకు ఉపయోగించుకోవాల్సిన ఫిర్యాదులేనా అవి? అన్నారు. జుబేర్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడే జూలై 4న అతనిపై హాత్రాస్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వృందా గ్రోవర్ తెలిపారు. బుధవారం నాటికి సమాధానం ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసు జారీచేస్తూ జుబేర్‌కు కేసుల నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించింది.