న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కశ్మీర్ ఓ కల్లోల ప్రాంతమని, గత కొన్నేండ్లుగా అక్కడ కొనసాగుతున్న వివాదాలను సూపర్ హీరోలు సూపర్‌మ్యాన్, వండర్ వుమన్ పరిష్కరించారని పేర్కొంటూ డీసీ కామిక్స్ అనే యూట్యూబ్ చానల్లో ఓ యానిమేటెడ్ వీడియో ప్రత్యక్షమైంది. ప్రభుత్వం పంపించిన వైమానిక దళాలను ఈ ఇద్దరు హీరోలు తరిమికొట్టడం.. కశ్మీర్‌ను స్వేచ్ఛా ప్రాంతంగా ప్రకటించడం వీడియోలో కనిపిస్తున్నది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ సమస్యపై కాకుండా అఫ్గానిస్థాన్‌పై సూపర్ హీరోలు దృష్టిసారిస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. అయితే, ఈ వీడియో ఎవరు సృష్టించారన్న విషయం తెలియాల్సి ఉన్నది. కాగా, కశ్మీర్ ఎప్పటికీ తమ అంతర్భాగమని భారత్ స్పష్టంచేస్తున్న విషయం తెలిసిందే.