న్యూఢిల్లీ, డిసెంబర్ 29: టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారికి ఓ శుభవార్త. ప్రతి రోజూ కాసేపు ఎండలో నిలబడితే చాలు.. షుగర్ నియంత్రణలోకి వస్తుందట. రోజూ తీసుకునే మందులు, ఇంజెక్షన్ల కన్నా ఇది ప్రభావవంతంగా పనిచేస్తున్నదని మాస్ట్రిచ్ యూనివర్సిటీ (నెదర్లాండ్స్) పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. కిటికీ ద్వారా అయినా సరే సహజ సూర్యరశ్మిని క్రమం తప్పకుండా పొందినట్టయితే టైప్-2 డయాబెటిస్‌ను సమర్థంగా నియంత్రించుకోగలరని పరిశోధకులు చెబుతున్నారు.
జీవక్రియలు, ఇన్సులిన్ ప్రతిస్పందనను ప్రభావితం చేసే ‘సిర్కాడియం రిథమ్’లకు సూర్యరశ్మి మద్దతు ఇస్తున్నదని వారి అధ్యయనం కనుగొన్నది. ఎంపికచేసిన కొంతమందిని ఓ గదిలో ఉంచి, కిటికీ నుంచి వచ్చే ఎండ వారిపై పడేలా చేశారు. అలా నాలుగున్నర రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి.. గ్లూకోజ్ స్థాయిల్ని నమోదుచేశారు. తిరిగి ఇదే ప్రయోగాన్ని.. కృత్రిమ కాంతి పరిధిలో జరిపారు. ఎండలో ఉన్నవాళ్లకు నాలుగున్నర రోజుల్లో 50 శాతం సమయం బ్లడ్ షుగర్ మెరుగైన స్థాయిలో ఉన్నట్టు తేలింది.
ప్రీడయాబెటిస్ లేదా టైప్ 2 మధుమేహంతో బాధపడే వ్యక్తుల్లో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించడంలో పసుపు సాయపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కర్కుమిన్ లేదా పసుపు సిస్టోలిక్ లేదా డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందా? అనే అంశంపై తాజాగా అధ్యయనం జరిగింది. ప్రీడయాబెటిస్తో బాధపడుతున్న వయోజనులకు కర్కుమిన్ లేదా పసుపును వాడటం వల్ల వచ్చిన ఫలితాలను విశ్లేషించారు. చికిత్స లేనప్పటితో పోల్చినపుడు, కర్కుమిన్ లేదా పసుపును వాడినపుడు సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ సుమారు 2.69 ఎంఎంహెచ్‌జీ తగ్గినట్లు గుర్తించారు.