ముంబై : టీమిండియా మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli).. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే అతను ముంబైలోని ఆకృతి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. వినోద్ కాంబ్లీ ఇండియా తరపున 104 వన్డేలు, 17 టెస్టులు ఆడాడు. ఇటీవల తీవ్రమైన ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అతన్ని ఆదుకునేందుకు కొందరు క్రికెటర్లు ముందుకు వచ్చారు. ఆస్పత్రిలో చేరిన సమయంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అతని బిల్లులు కట్టాడు. అతని ఆర్థిక పరిస్థితిని చూసి చలించిన సునీల్ గవాస్కర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మూత్రకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వినోద్ కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు గవాస్కర్‌కు చెందిన సంస్థ నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కాంబ్లీని హెల్ప్ చేసేందుకు గవాస్కర్ ప్రామిస్ చేశాడు. దాని ప్రకారం గవాస్కర్‌కు చెందిన చాంప్స్ ఫౌండేషన్ .. కాంబ్లీకి ప్రతి నెల 30 వేలు ఇవ్వనున్నది. దీనికి తోడు ప్రతి ఏడాది 30వేలు వైద్య చికిత్స కోసం వెచ్చించనున్నారు. ఇటీవల వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రంలో కాంబ్లీని గవాస్కర్ కలిసిన విషయం తెలిసిందే.
కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ ఓ దశలో అతనికి విడాకులు ఇవ్వాలనుకున్నది. 2023లో విడాకులు ఫైల్ చేసింది కూడా. కానీ ఆ నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నది. కాంబ్లీ ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు జర్నలిస్టు సూర్యాంశీ పాండేతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు.