Suicides : కొద్ది రోజుల క్రితం ఓ కాలిపోయిన కారులో మహిళ మృతదేహం (Woman dead body) లభ్యమైంది. శుక్రవారం ఆమె మృతదేహం లభ్యమైన చోటనే గోతిలో ఆమె సోదరుడి మృతదేహం దొరికింది. అన్నా చెల్లెల్లు ఇద్దరూ అత్మహత్యల (Suicides) కు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని తపోవన్ ఏరియాలో కొన్ని రోజుల క్రితం ఓ 40 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. కాలిపోయిన కారులో కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆమె మృతదేహం లభించిన ప్రదేశంలోనే రోడ్డు పక్కన గోతిలో ఆమె 45 ఏళ్ల సోదరుడి మృతదేహం దొరికింది.
ముందుగా మహిళ మృతదేహం లభ్యం కాగానే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆమె తన సోదరుడితో కలిసి ఉండేదని తెలిసింది. రెండు నెలల క్రితం వాళ్లు ఒడిశాలోని రాయ్‌గఢ్ నుంచి చమోలీకి వచ్చి ఉంటున్నారని, రెంటు లేని ఓ ఇంట్లో తలదాచుకునేవారని, రోజువారికి ఖర్చుల కోసం ఇరుగు పొరుగు వారిని డబ్బులు అడుక్కునే వారని పోలీసులు గుర్తించారు.
ఆ తర్వాత మృతురాలి సోదరుడి జాడ కోసం వెతికారు. నాలుగైదు రోజుల తర్వాత ఇప్పుడు సోదరి మృతదేహం లభించిన చోటనే గోతిలో సోదరుడి మృతదేహం కూడా కనిపించింది. కాలిపోయిన కారు పక్కన విషయం డబ్బా ఉండటంతో ఇద్దరూ ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా మహిళ విషం సేవించి, కారుకు నిప్పంటించుకుని ఉండవచ్చని, ఆ తర్వాత ఆమె సోదరుడు కూడా విషం తాగి గోతిలోకి దొర్లి ఉంటాడని అంచనా వేస్తున్నారు.