పెట్రోల్, డీజిల్‌పై విధించిన ట్యాక్సులతో కేంద్రానికి సమకూరిన ఆదాయం ఇది
2021లోనే 3.7 లక్షల కోట్ల రాబడి
రాజ్యసభకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: పెట్రోవాతతో సామాన్యుడి నడ్డివిరుస్తూ మోదీ సర్కారు లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్‌పై విధించిన పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.8.02 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే ట్యాక్సుల ద్వారా రూ.3.71 లక్షల కోట్లను కేంద్రం తన ఖజానాలో వేసుకుంది. రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ విషయం వెల్లడించారు. గత మూడేండ్లలో పెట్రోల్, డీజిల్‌పై విధించిన ఎక్సైజ్ డ్యూటీ వివరాలు, చమురుపై విధించిన పన్నులు, సమకూరిన ఆదాయం లెక్కలు తెలియజేయాలంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు నిర్మలాసీతారామన్ రాతపూర్వకంగా ఈ వివరణ ఇచ్చారు.
నల్లధనంపై అంచనా వేయలేదు : కేంద్రం
గత ఐదేండ్ల కాలంలో విదేశీ ఖాతాల్లో నల్లధనం ఎంత ఉందో అనేదానిపై అధికారికంగా ఎలాంటి అంచనా వేయలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌కు తెలిపింది. నల్లధనం స్వచ్ఛందంగా ప్రకటించేందుకు 2015లో కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువులో 648 మంది రూ.4,164 కోట్ల నల్లధనం వెల్లడించారని , దీనిపై పన్నులు, పెనాల్టీల రూపంలో రూ.2,476 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది.
రోజుకు 31 మంది మైనర్ల ఆత్మహత్య
గతేడాది సగటున రోజుకు 31 మంది మైనర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రం మంగళవారం పార్లమెంట్‌కు తెలిపింది. 2020లో మొత్తంగా 11,396 మంది 18 ఏండ్ల లోపు చిన్నారులు బలవన్మరణానికి పాల్పడ్డారని హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.