ముంబై : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షేమం కోరుతూ రచయిత సుధామూర్తి ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్ జిల్లాలోని ప్రముఖ ఆలయానికి సుధామూర్తి బుధవారం ఉదయం వెళ్లారు. బ్రిటన్ ప్రధాని ఎన్నికైన తన అల్లుడు రిషి సునాక్ క్షేమంగా ఉండాలని, అద్భుతమైన పరిపాలన కొనసాగించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవగఢ్ పరిధిలోని దుర్గా దేవి ఆలయంలోనూ నిన్న సాయంత్రం సుధామూర్తి పూజలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా సుధామూర్తి.. యశ్వంత్ రావు రానే హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు.
దాదాపు 200 ఏండ్ల పాటు భారత్‌లో వలస పాలన సాగించిన బ్రిటన్‌లో భారత సంతతి నేత రిషి సునాక్.. ఆ దేశ ప్రధానిగా ఈ ఏడాది అక్టోబర్ 25న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మినీ బడ్జెట్‌తో పాటు సంపన్నులపై పన్ను కోతలు విధించడంతో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం విదితమే. లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో బ్రిటన్ ప్రధానిని ఎన్నుకోవాల్సిన పరిస్థితులు నెలకొనడంతో.. తాను మళ్లీ బరిలో నిలుస్తున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రకటించారు. ఆయనకు దాదాపు 193 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా రిషి సునాక్ (42) నిలిచారు.