శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో చలి పంజా విసిరింది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో జనం చలికి గజగజ వణికిపోతున్నారు. గుల్మార్గ్, పహల్గామ్లో తేమ బాగా తగ్గడంతో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. దాంతో ఆ ఏరియాల్లో చలి మరింత తీవ్రమైంది. బారాముల్లా జిల్లాలో ప్రముఖ స్కై రిసార్ట్ అయిన గుల్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మైనస్ 10.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.
కశ్మీర్ లోయలో రాత్రి ఉష్ణోగ్రతలు గత మూడు రాత్రుల నుంచి వరుసగా మైనస్ 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ అయిన పహల్గామ్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మైనస్ 10.4 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయాయి. కేవలం వేసవి రాజధాని శ్రీనగర్‌లో మాత్రమే పగటి ఉష్ణోగ్రతలు ఫ్రీజింగ్ పాయింట్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ ఇవాళ 0.2 డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.