UGC | న్యూఢిల్లీ, నవంబర్ 28: డిగ్రీ పూర్తి చేయాలంటే ఇక మూడు, నాలుగేండ్లు ఆగాల్సిన పని లేదు. అభ్యాస సామర్థ్యాలను బట్టి కోర్సు కాలాన్ని పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం విద్యార్థులకు ఉండనుంది. ఈ మేరకు యూజీసీ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానున్నది.
ఉన్నత విద్యాసంస్థలు యాక్సెలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఏడీపీ), ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ) కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన నిబంధనలకు యూజీసీ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ విధానం అమలులోకి వస్తే విద్యార్థులు మొదటి సెమిస్టర్ లేదా రెండో సెమిస్టర్ పూర్తయ్యే లోగా ఏడీపీ లేదా ఈడీపీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఈ దరఖాస్తులను ఆయా విద్యాసంస్థల్లోని కమిటీలు పరిశీలించి ఆమోదించడమో తిరస్కరించడమో చేస్తాయి. ఏడీపీ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రతి సెమిస్టర్‌కు అదనపు క్రెడిట్లను పొందాల్సి ఉంటుంది. ఈడీపీ విద్యార్థులు తక్కువ క్రెడిట్లను పొందొచ్చు. వీరికి ఇచ్చే డిగ్రీలకు కూడా మిగతా డిగ్రీలతో సమానంగా విలువ ఉంటుంది.