డెహ్రాడూన్, సెప్టెంబర్ 25: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో యూకేఎస్ఎస్ఎస్సీ పేపర్ లీక్ కావడం పట్ల యువతలో ఆగ్రహం పెల్లుబికింది. ఉద్యోగార్థుల ప్రయోజనాన్ని కాపాడటంలో ప్రభుత్వ అసమర్థత బయటపడిందని, సమర్థవంతంగా ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించడంలో దామి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పలువురు ఆరోపించారు. పేపర్ లీక్ కావడంపై వేలాది మంది యువత వీధుల్లోకి వచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకైన పేపర్‌ను రద్దు చేసి, దానిపై సీబీఐ విచారణ జరిపే వరకు తమ ఆందోళన విరమించమని డెహ్రాడూన్ పెరేడ్ గ్రౌండ్లో యువత ఆందోళనను కొనసాగిస్తున్నది.
ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (యూకేఎస్ఎస్ఎస్సీ) ఈ నెల 21న గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగ నియామక పరీక్షను నిర్వహించింది. అయితే పరీక్ష ప్రారంభమైన 35 నిమిషాలకే ఆ పరీక్ష పేపర్ సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంతో పేపర్ లీక్‌పై ఉద్యోగార్థులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పేపర్ లీక్‌కు ఆ పరీక్షకు హాజరైన ఖలీద్ మాలికే కారణమని పోలీసులు గుర్తించారు. అతను రహస్యంగా దాచిన సెల్ ఫోన్ ద్వారా పరీక్ష పేపర్‌ను ఫొటో తీసి తన సోదరి హీనాకి పంపాడని, ఆమె తెహ్రీలోని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ సుమన్‌కు పంపగా, ఆయన యువ నేత బాబీ పన్వర్‌కు పంపినట్టు పోలీసులు తెలిపారు.
పేపర్ లీకైన కాలేజీ ప్రిన్సిపాల్ ధర్మేంద్ర చౌహాన్ బీజేపీ హరిద్వార్ మీడియా సెల్ చీఫ్ అని స్థానిక పత్రికలు వెల్లడించాయి. పేపర్ లీక్‌పై ఉత్తరాఖండ్ బెరోజ్గర్ సంఘ్, ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిషేధ ఉత్తర్వులు ధిక్కరించి పలు ప్రాంతాల్లో వందలాది మంది నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలు జరిపారు. డెహ్రాడూన్‌లో రోడ్డును దిగ్బంధించిన నిరుద్యోగులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలని, పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.