CAT 2021 | క్యాట్(Common Admission Test ) పరీక్షలో నెగ్గడం అనేది మామూలు విషయం కాదు. లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. ఎంత కష్టపడి చదివినా.. పుస్తకాలకు పుస్తకాలు తిరగేసినా.. కొన్ని నెలల పాటు కూర్చొని చదివినా కొందరు క్యాట్ పరీక్షలో క్వాలిఫై కారు. కానీ.. ఈ యువకుడు మాత్రం ఒక్క పుస్తకం చదవకుండా.. పెన్ను పెట్టి రాయకుండా.. సింపుల్‌గా యూట్యూబ్‌లో వీడియోలు చూసి క్యాట్ పరీక్ష రాసి టాపర్‌గా నిలిచాడు.
అహ్మదాబాద్‌కు చెందిన చిరాగ్ గుప్తా గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. అతడి వయసు 21 ఏళ్లు. ప్రస్తుతం పూణెలోని ఐఐఎస్ఈఆర్ ఇన్స్టిట్యూట్లో బీఎస్ ఎంఎస్ ప్రోగ్రామ్ కోర్సు చేస్తున్నాడు. ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఓవైపు ఎంఎస్ ప్రోగ్రామ్ చేస్తూనే.. క్యాట్‌కు ప్రిపేర్ అయ్యాడు. టాపర్‌గా నిలిచాడు. నూటికి నూరు శాతం మార్కులు సాధించాడు.
నిజానికి నాకు ఫిజిక్స్‌లో రీసెర్చ్ చేయడం అంటే ఇష్టం. కానీ.. బీఎస్ ఎంఎస్ సెమిస్టర్ ప్రాజెక్ట్‌లో నీటి ఎద్దడిపై ఓ ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. దీంతో నా ఫోకస్ మొత్తం నీటి సంక్షోభం వైపు మళ్లింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు నీటి కొరతతో బాధపడుతున్నాయి. అందుకే దాని మీద రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఐఐఎస్ఈఆర్ పూణెలో చేరడానికి కారణం కూడా నాకు రీసెర్చ్ చేయడం అంటే ఇష్టం. 2017లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో నాకు వచ్చిన ర్యాంకుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు వచ్చింది కానీ.. అందులో చేరలేదు. డ్యుయల్ డిగ్రీ చేయాలని ఐఐఎస్ఈఆర్లో చేరా.. అంటూ చెప్పుకొచ్చాడు చిరాగ్.
నిజానికి క్యాట్ పరీక్షను నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఊరికే సరదాగా అటెంప్ట్ చేద్దామనుకున్నా. అందుకే.. పుస్తకాలు కొనలేదు. పెన్ను పెట్టి రాయలేదు. యూట్యూబ్‌లో వీడియోలు మాత్రం రెగ్యులర్‌గా చూసేవాడిని. వీడియో క్లాస్‌లు వినేవాడిని. వారానికి ఒక మాక్ టెస్ట్ రాసేవాడిని. పరీక్ష దగ్గర పడుతుండగా వారానికి ఓ నాలుగైదు మాక్ టెస్టులు రాయడం స్టార్ట్ చేశా. మాక్ టెస్టులలో ఏదైనా డౌట్ వచ్చినా.. పరీక్ష ప్రిపరేషన్ కోసం అన్నింటికీ యూట్యూబ్ మీదనే ఆధారపడ్డా. నా సొంతంగానే నేను నేర్చుకున్నా. ఎటువంటి కోచింగ్ కూడా తీసుకోలేదు.. అని చిరాగ్ చెప్పాడు.