కోల్‌కతా: ఒక యువతి షాపింగ్ మాల్లో చాక్లెట్ చోరీ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జైగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ పల్లి ప్రాంతానికి చెందిన ఒక యువతి డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నది. సెప్టెంబర్ 29న తన సోదరితో కలిసి ఆ ప్రాంతంలోని షాపింగ్ మాల్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ర్యాక్‌లో ఉన్న ఒక చాక్లెట్‌ను చోరీ చేసింది. అయితే దీనిని గమనించిన సిబ్బంది షాపు నుంచి బయటకు వెళ్తునప్పుడు ఆమెను పట్టుకున్నారు. దీంతో ఆ చాక్లెట్ ధరను చెల్లించిన ఆ యువతి, దీనిపై క్షమాపణలు చెప్పింది.
కాగా, ఆ షాపింగ్ మాల్లోని సీసీటీవీలో రికార్డైన చాక్లెట్ చోరీ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. దీంతో అవమానం భరించలేని ఆ విద్యార్థిని ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ షాపింగ్ మాల్ ఎదుట నిరసనకు దిగారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.