చెన్నై, ఫిబ్రవరి 11: దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట మార్చిన నగరంలోని ఓ వీధి నామఫలకాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మంగళవారం ఆవిష్కరించారు. ఎస్పీబీగా ప్రసిద్ధి పొందిన బాలసుబ్రహ్మణ్యం నివసించిన నుంగంబాకం ప్రాంతంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఆయన గౌరవార్థం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శాలైగా మారుస్తూ ఇటీవలే ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శాలై నామఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉదయనిధి ఆయన నివాసాన్ని సందర్శించి ఎస్పీబీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎస్పీబీ కుటుంబ సభ్యులతో ఉదయనిధి మాట్లాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషలలో 40 వేలకు పైగా సినీగీతాలు ఆలపించిన ఎస్పీబీ కరోనాబారినపడి చికిత్స పొందుతూ 2020 సెప్టెంబర్లో కన్నుమూశారు.