ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన నెట్వర్కింగ్ కంపెనీ ‘స్టార్‌లింక్’. వినియోగదారులకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. శాటిలైట్ ద్వారా అందే ఈ ఇంటర్నెట్ చాలా వేగంగా ఉంటుంది. అలాగే మారుమూల కొండ ప్రాంతాలకు కూడా సిగ్నల్ దొరుకుతుంది.
భారత్‌లో ‘స్టార్‌లింక్’ అందుబాటులోకి రానుందని తెలియడంతో చాలా మంది వినియోగదారులు ఈ సేవను సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నారు. అయితే ఇంకా ఈ కంపెనీకి కమర్షియల్ లైసెన్స్ అందలేదని భారత ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి ప్రజలెవరూ ఈ కంపెనీ సేవలను సబ్స్క్రయిబ్ చేసుకోవద్దని కోరింది.
ఈ క్రమంలో స్టార్‌లింక్ కంపెనీ భారతదేశ శాఖ హెడ్ సంజయ్ భార్గవ స్పందించారు. వచ్చే నెల అంటే 2022 జనవరి చివరినాటికి భారత్‌లో కమర్షియల్ లైసెన్స్ కోసం ‘స్టార్‌లింక్’ దరఖాస్తు చేసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మనం ఉపయోగించే ఇంటర్నెట్ మొత్తం టవర్ల ద్వారా వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ సిగ్నల్ టవర్లు ఏర్పాటు చేయడం కష్టంగా ఉంటుంది.
ఈ కారణంగానే ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు సరిగా అందవు. స్టార్‌లింక్ ద్వారా అందే ఇంటర్నెట్కు ఇలాంటి ఇబ్బందులు ఉండవని సమాచారం. మస్క్‌తోపాటు అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ కూడా ఈ మార్కెట్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.