TVK Party | చెన్నై, అక్టోబర్ 28: తమిళ స్టార్ హీరో విజయ్ ఆదివారం నిర్వహించిన తన పార్టీ మొదటి బహిరంగ సభ తమిళ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరతీసింది. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని విజయ్ సిద్ధం చేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో గత అర్ధ శతాబ్దంగా డీఎంకే, అన్నా డీఎంకే మధ్యనే పోటీ కొనసాగుతూ వచ్చింది. అయితే, జయలలిత మరణంతో అన్నా డీఎంకే పూర్తిగా బలహీన పడింది. బీజేపీతో పాటు పలు చిన్న పార్టీలు డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నించినా లోక్‌సభ ఎన్నికల్లో వాటి ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీంతో ప్రస్తుతం అధికార డీఎంకేను ఎదుర్కొనే ప్రత్యామ్నాయం లేని రాజకీయ శూన్యత తమిళ రాజకీయాల్లో ఉంది. సరిగ్గా ఈ విషయాన్ని గుర్తించిన విజయ్.. డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు, అన్నా డీఎంకే స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరో ఎంజీఆర్ అవుతారా?
సినీ రంగానికి చెందిన వారిని రాజకీయంగా ఆదరించడం తమిళనాడులో కొత్తేమీ కాదు. ఒకప్పటి ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్ సినీ నేపథ్యం నుంచి వచ్చి అన్నా డీఎంకే పార్టీని స్థాపించి విజయవంతమయ్యారు. మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలితకు సైతం సినీ నేపథ్యం ఉంది. సినీ ప్రముఖులను ఆదరించడమే కాదు తిరస్కరించిన చరిత్ర కూడా తమిళులకు ఉంది. విజయ్‌కాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు రాజకీయంగా రాణించలేకపోయారు. ఈ నేపథ్యంలో విజయ్ మరో ఎంజీఆర్ అవుతారా? లేదా విజయ్‌కాంత్, కమల్ హాసన్‌లా మిగిలిపోతారా? అనేది మరో 18 నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు తేల్చేయనున్నాయి.
ప్రత్యామ్నాయ సిద్ధాంతానికి ఆదరణ ఉంటుందా?
తమిళనాడులో దశాబ్దాలుగా ద్రావిడవాద రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. ఈవీ రామస్వామి పెరియార్, అన్నాదురై సిద్ధాంతాలు, ఆశయాల ఆధారంగా పార్టీలు నడుస్తున్నాయి. ఈ విషయంలో విజయ్ కొంత భిన్నమైన సిద్ధాంతాన్ని ఎంచుకున్నారు. తనకు ద్రావిడవాదం, జాతీయవాదం రెండు కళ్ల లాంటివని విజయ్ ప్రకటించారు. పెరియార్, కే కామరాజ్, బీఆర్ అంబేద్కర్ వంటి నాయకుల ఆలోచనలే తనకు స్ఫూర్తి అని చెప్పినప్పటికీ తనది నాస్తికవాదం కాదని విజయ్ స్పష్టం చేశారు. తద్వారా ద్రావిడవాదం, నాస్తికత్వాన్ని నమ్ముకునే డీఎంకేకు, జాతీయవాదం, మతాన్ని నమ్ముకునే బీజేపీకి భిన్నంగా విజయ్ వెళ్తున్నారు. ఈ కొత్త వాదానికి తమిళుల ఆదరణ లభిస్తుందా అనేది చూడాల్సి ఉంది.